Logo

నిర్గమకాండము అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను

02 ఇశ్రాయేలీయులలో మనుష్యులయొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.

03 మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.

04 ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి గదా.

05 యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.

06 ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను.

07 పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.

08 మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను.

09 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.

10 కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.

11 యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత

12 ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును.

13 ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను.

14 ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.

15 ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.

16 బాహుబలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీచేతిమీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.

17 మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.

18 అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱ సముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.

19 మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొనివచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొనిపోవలెనని ఇశ్రాయేలీయులచేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.

20 వారు సుక్కోతునుండి ప్రయాణమైపోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.

21 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.

22 ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యెదుటనుండి తొలగింపలేదు.