Logo

నిర్గమకాండము అధ్యాయము 19

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవ నెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.

02 వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.

03 మోషే దేవుని యొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతమునుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా

04 నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నాయొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి.

05 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.

06 సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా

07 మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.

08 అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగివెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.

09 యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా

10 యెహోవా మోషేతో నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని

11 మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.

12 నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.

13 ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెననెను.

14 అప్పుడు మోషే పర్వతము మీదనుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి.

15 అప్పుడతడు మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.

16 మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహా ధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.

17 దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.

18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.

19 ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.

20 యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను

21 అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.

22 మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధ పరచుకొనవలెనని మోషేతో చెప్పగా

23 మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధ పరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.

24 అందుకు యెహోవా నీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారిమీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పెను

25 మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను.