Logo

నిర్గమకాండము అధ్యాయము 25

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యునియొద్ద దాని తీసికొనవలెను.

03 మీరు వారియొద్ద తీసికొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,

04 నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,

05 ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,

06 ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,

07 లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.

08 నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

09 నేను నీకు కనుపరచు విధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.

10 వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర, దాని వెడల్పు మూరెడునర, దాని యెత్తు మూరెడునర

11 దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్టవలెను.

12 దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.

13 తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి

14 వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.

15 ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;

16 ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలెను.

17 మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.

18 మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.

19 ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనలమీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను

20 ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచవలెను.

21 నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

22 అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీదనుండియు, శాసనములుగల మందసము మీదనుండు రెండు కెరూబుల మధ్యనుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను

23 మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.

24 మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింపవలెను.

25 దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.

26 దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను

27 బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.

28 ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్ల మోయబడును.

29 మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయవలెను.

30 నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.

31 మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషిపనిగా చేయవలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై యుండవలెను.

32 దీపవృక్షము యొక్క ఒక ప్రక్కనుండి మూడు కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు నిగుడవలెను.

33 ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.

34 మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,

35 దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మలక్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.

36 వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషిపనిగా ఉండవలెను.

37 నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.

38 దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.

39 ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.

40 కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.