Logo

నిర్గమకాండము అధ్యాయము 26

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.

02 ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.

03 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.

04 తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.

05 ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.

06 మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.

07 మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.

08 ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.

09 అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.

10 తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.

11 మరియు ఏబది యిత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను.

12 ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.

13 మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.

14 మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను.

15 మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.

16 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.

17 ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసి పెట్టవలెను.

18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.

19 మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.

20 మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,

21 ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను.

22 పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.

23 మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.

24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితోఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.

25 పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.

26 తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును

27 మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును ఉండవలెను;

28 ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.

29 ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకును బంగారు రేకును పొదిగింపవలెను.

30 అప్పుడు కొండమీద నీకు కనుపరచబడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.

31 మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.

32 తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.

33 ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

34 అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.

35 అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.

36 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.

37 ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను.