Logo

నిర్గమకాండము అధ్యాయము 30

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.

02 దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను.

03 దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.

04 దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.

05 అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను.

06 సాక్ష్యపుమందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.

07 అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.

08 మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.

09 మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీయమునైనను దానిమీద పోయకూడదు.

10 మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాపపరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.

11 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను.

12 వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.

13 వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.

14 ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.

15 అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.

16 నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును.

17 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి

18 ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.

19 ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను.

20 వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.

21 తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.

22 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో

23 పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధము గల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును

24 నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని

25 వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.

26 ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును

27 బల్లను దాని ఉపకరణములన్నిటిని దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను

28 దహనబలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి

29 అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును.

30 మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను.

31 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేక తైలమై యుండవలెను;

32 దానిని నర శరీరముమీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దానివంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను.

33 దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.

34 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని

35 వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.

36 దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాని నుంచవలెను. అది మీకు అతిపరిశుద్ధముగా ఉండవలెను.

37 నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.

38 దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.