Logo

ఆమోసు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్యజనమునకు పెద్దలైనవారికి శ్రమ

02 కల్నేకు పోయి విచారించుడి; అక్కడనుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.

03 ఉపద్రవదినము బహుదూరమున నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీమధ్య మీరు పీఠములు స్థాపింతురు.

04 దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.

05 స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు.

06 పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళతైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.

07 కాబట్టి చెరలోనికి ముందుగా పోవువారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము; వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని

08 ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.

09 ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.

10 ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడు ఇంకెవరును లేరనును; అంతట దాయా దిట్లనును నీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు;

11 ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు

12 గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,

13 న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి.

14 ఇందుకు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, నేను మీమీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు.