Logo

మీకా అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడివేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.

02 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.

03 కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతో కూడ తిరిగివత్తురు.

04 ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామమహాత్మ్యమునుబట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతములవరకు ప్రబలుడగును,

05 ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.

06 వారు అష్షూరు దేశమును, దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గముచేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.

07 యాకోబు సంతతిలో శేషించినవారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్యప్రయత్నము లేకుండను నరుల యోచన లేకుండను గడ్డిమీద పడు వర్షమువలెను ఆ యా జనముల మధ్యను నుందురు.

08 యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱల మందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.

09 నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడి యుండునుగాక, నీ శత్రువులందరు నశింతురుగాక.

10 ఆ దినమున నేను నీలో గుఱ్ఱములుండకుండ వాటిని బొత్తిగా నాశనముచేతును, నీ రథములను మాపివేతును,

11 నీ దేశమందున్న పట్టణములను నాశనముచేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారు లేకుండ నిర్మూలముచేతును.

12 మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు.

13 నీచేతిపనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములును దేవతా స్తంభములును నీ మధ్య ఉండకుండ నాశనముచేతును,

14 నీ మధ్యను దేవతా స్తంభములుండకుండ వాటిని పెల్లగింతును, నీ పట్టణములను పడగొట్టుదును.

15 నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతికారముచేతును; ఇదే యెహోవా వాక్కు.