Logo

నహూము అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

02 యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును; ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.

03 యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

04 ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును.

05 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.

06 ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని యెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.

07 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును.

08 ప్రళయజలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,

09 యెహోవానుగూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును.

10 ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోవుదురు.

11 నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.

12 యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణబలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు; నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.

13 వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.

14 నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టకయుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.

15 సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.