Logo

హబక్కూకు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.

02 యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపకయున్నావు.

03 నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.

04 అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.

05 అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.

06 ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను.

07 వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

08 వారి గుఱ్ఱములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.

09 వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు.

10 రాజులను అపహాస్యముచేతురు, అధిపతులను హేళనచేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటిదిబ్బ వేసి వాటిని పట్టుకొందురు.

11 తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొనిపోవునట్లు వారు కొట్టుకొనిపోవుచు అపరాధులగుదురు.

12 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.

13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

14 ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.

15 వాడు గాలము వేసి మానవులనందరిని గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.

16 కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.

17 వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయుచుండవలెనా?