Logo

జెఫన్యా అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

02 ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.

03 మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరును లేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.

04 నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.

05 మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టియు, బయలుదేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.

06 యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయనయొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.

07 ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్ని ధిని మౌనముగా నుండుడి.

08 యెహోవా యేర్పరచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.

09 మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును.

10 ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.

11 కనానీయులందరు నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.

12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.

13 వారి ఆస్తి దోపుడుసొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు.

14 యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.

15 ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహా నాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ము దినము.

16 ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.

17 జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును.

18 యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.