Logo

జెఫన్యా అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది.

02 విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీమీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.

03 దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు.

04 గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.

05 సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్నుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.

06 సముద్రప్రాంతము గొఱ్ఱల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.

07 తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.

08 మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.

09 నా జీవముతోడు మోయాబు దేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోను దేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పుగోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే.

10 వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.

11 జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును.

12 కూషీయులారా, మీరును నా ఖడ్గముచేత హతులవుదురు.

13 ఆయన ఉత్తర దేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును; నీనెవె పట్టణమును పాడుచేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.

14 దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గంపులుగా కూడును; గూడబాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కనుపించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపని యంతటిని యెహోవా నాశనము చేయును.

15 నావంటి పట్టణము మరియొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గమున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.