Logo

జెకర్యా అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నాతో మాటలాడుచున్న దూత తిరిగివచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్నులేపి

02 నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.

03 మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి

04 నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూతనడిగితిని.

05 నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా యని నన్నడుగగా నేను--నా యేలినవాడా, నాకు తెలియదంటిని.

06 అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.

07 గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.

08 యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

09 జెరుబ్బాబెలుచేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతనిచేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.

10 కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించినవాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలుచేతిలో గుండునూలుండుట చూచి సంతోషించును.

11 దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు,

12 రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా

13 అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా యనెను నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా

14 అతడు వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.