Logo

జెకర్యా అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్యనుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.

02 మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,

03 మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.

04 నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా

05 అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.

06 నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.

07 బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోకమందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.

08 అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశములోనికి పోవువాటిని చూడుము; అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను.

09 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

10 చెరపట్టబడిన వారిలో బబులోనునుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికి పోయి

11 వారినడిగి వెండి బంగారములను తీసికొని కిరీటము చేసి ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి

12 అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.

13 అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.

14 ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి, హేలెమునకును టోబీయాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును.

15 దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీయొద్దకు పంపెనని మీరు తెలిసికొందురు; మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.