Logo

జెకర్యా అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

02 సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను.

03 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును.

04 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.

05 ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును.

06 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు.

07 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు దేశములోనుండియు పడమటి దేశములోనుండియు నేను నా జనులను రప్పించి రక్షించి

08 యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనైయుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.

09 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తలనోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.

10 ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయముచేత నెమ్మది లేకపోయెను; ఏలయనగా ఒకరిమీదికొకరిని నేను రేపుచుంటిని.

11 అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను.

12 సమాధాన సూచకమైన ద్రాక్షచెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

13 యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును; భయపడక ధైర్యము తెచ్చుకొనుడి.

14 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడుచేయ నుద్దేశించినట్లు

15 ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి.

16 మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.

17 తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణముచేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.

18 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

19 సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.

20 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.

21 ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారియొద్దకు వచ్చిఆలస్యము చేయక యెహొవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు.

22 అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు.

23 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.