Logo

జెకర్యా అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి

02 ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొనియున్న హమాతునుగూర్చియు, జ్ఞానసమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.

03 తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.

04 యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతికప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.

05 అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.

06 అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను.

07 వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదావారిలో పెద్దలవలె నుందురు, ఎక్రోనువారును యెబూసీయులవలె నుందురు.

08 నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను.

09 సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.

10 ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపువిల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

11 మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.

12 బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.

13 యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.

14 యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువబడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును.

15 సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు, వడిసెల రాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు, ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు, బలిపశురక్త పాత్రలును బలిపీఠపు మూలలును నిండునట్లు రక్తముతో నిండియుందురు.

16 నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.

17 వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధినొందుదురు.