Logo

జెకర్యా అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 లెబానోనూ, అగ్నివచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము.

02 దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.

03 గొఱ్ఱబోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యొర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను.

04 నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా వధకేర్పడిన గొఱ్ఱలమందను మేపుము.

05 వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటియెడల కనికరము చూపరు.

06 ఇదే యెహోవా వాక్కు నేనికను దేశనివాసులను కనికరింపక ఒకరిచేతికి ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశమును, నాశనము చేయగా వారిచేతిలోనుండి నేనెవరిని విడిపింపను.

07 కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధకమనునట్టియు రెండు కఱ్ఱలుచేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచు వచ్చితిని.

08 ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.

09 కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను; చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి యొకదాని మాంసము ఒకటి తినవచ్చును అనిచెప్పి

10 సౌందర్యమను కఱ్ఱను తీసికొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచితిని.

11 అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని యున్న గొఱ్ఱలు తెలిసికొనెను.

12 మీకు అనుకూలమైనయెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి.

13 యెహోవా యెంతో అబ్బురముగా వారు నాకేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.

14 అప్పుడు బంధకమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని.

15 అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక కాపరి పనిముట్లను తీసికొమ్ము.

16 ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాని కాపు కాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును.

17 మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.