Logo

జెకర్యా అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా

02 నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

03 ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగాచేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

04 ఇదే యెహోవా వాక్కు ఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదావారిమీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును.

05 అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు.

06 ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెలక్రింది నిప్పులుగాను పనలక్రింది దివిటీగానుచేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు.

07 మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.

08 ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటి వారుగాను, దావీదు సంతతివారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

09 ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

10 దావీదు సంతతివారి మీదను యెరూషలేము నివాసులమీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11 మెగిద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12 దేశ నివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13 లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14 మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.