క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 ఇశ్రాయేలీయులనుగూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు.
02 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.
03 ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని.
04 మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.
05 కన్నులార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు.
06 కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
07 నా బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమిచేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా
08 గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించినయెడల అది దోషము కాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
09 దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీచేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
10 మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
11 తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
12 అయితేయెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు
13 అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.
14 నేను ఘనమైన మహారాజునై యున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది యుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.