Logo

మలాకీ అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవుదినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

02 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

03 నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

04 హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.

05 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.

06 నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.