Logo

లేవీయకాండము అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.

02 ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొనిరావలెను.

03 ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మముకంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.

04 నిగనిగలాడు మచ్చ చర్మములకంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్నయెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను.

05 ఏడవనాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను.

06 ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.

07 అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.

08 అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.

09 కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకునియొద్దకు వానిని తీసికొనిరావలెను.

10 యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబారినయెడలను, వాపులో పచ్చిమాంసము కనబడినయెడలను,

11 అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అపవిత్రుడు.

12 కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తల మొదలుకొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించియుండినయెడల

13 యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు.

14 అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు.

15 యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.

16 అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారినయెడల వాడు యాజకునియొద్దకు రావలెను;

17 యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు.

18 ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత

19 ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దాని కనుపరచవలెను.

20 యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.

21 యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మముకంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడినయెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.

22 అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.

23 నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.

24 దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.

25 నిగనిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము.

26 యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయేగాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను.

27 ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.

28 అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.

29 పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా

30 అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపుపచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడినయెడల, వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీదనేమి గడ్డముమీదనేమి పుట్టిన కుష్ఠము.

31 యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచినప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేనియెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

32 ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక యుండినయెడలను, దానిలో పసుపుపచ్చ వెండ్రుకలు లేనియెడలను, చర్మముకంటె పల్లము కానియెడలను,

33 వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

34 ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.

35 వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాని చూడవలెను,

36 అప్పుడు ఆ మాద వ్యాపించి యుండినయెడల యాజకుడు పసుపుపచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.

37 అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టినయెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.

38 మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల

39 యాజకుడు వానిని చూడవలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు.

40 తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయినను వాడు పవిత్రుడు.

41 ముఖమువైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు.

42 అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టినయెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్ఠము.

43 యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగానుండు తెల్లని పొడయైనయెడల

44 వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.

45 ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.

46 ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

47 మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి

48 నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి

49 ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.

50 యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

51 ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.

52 కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.

53 అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల

54 యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను.

55 ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.

56 యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడియుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.

57 అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.

58 ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలినయెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;

59 అప్పుడు అది పవిత్రమగును. బొచ్చుబట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలువస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.