Logo

లేవీయకాండము అధ్యాయము 16

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను

02 నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసముమీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.

03 అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.

04 అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.

05 మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొనిరావలెను.

06 అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి

07 ఆ రెండు మేకపిల్లలను తీసికొనివచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.

08 అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.

09 ఏ మేకమీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొనివచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

10 ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.

11 అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొనివచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి

12 యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరిమళధూప చూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు

13 ఆ ధూపము మేఘమువలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను.

14 అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.

15 అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.

16 అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టియు, అనగా వారి అపవిత్రతనుబట్టియు, వారి అతిక్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుటవలన వారి అపవిత్రతనుబట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.

17 పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.

18 మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి

19 యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.

20 అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొనిరావలెను.

21 అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేక తలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను.

22 ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.

23 అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి

24 పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహనబలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను

25 పాపపరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను

26 విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.

27 పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థబలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొనిపోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను.

28 వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.

29 ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవనాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను.

30 ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.

31 అది మీకు మహా విశ్రాంతిదినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.

32 ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.

33 మరియు అతడు అతిపరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.

34 సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.