Logo

లేవీయకాండము అధ్యాయము 17

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

02 నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట

03 ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొఱ్ఱయేగాని మేకయేగాని

04 ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;

05 వాడు రక్తమును ఒలికించినవాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధానబలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడవలెను.

06 యెహోవాకు ఇంపైన సువాసనగలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.

07 వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.

08 మరియు నీవు వారితో ఇట్లనుము ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలోగాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను

09 యెహోవాకు అర్పింప నుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.

10 మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలోనుండి వాని కొట్టివేయుదును.

11 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

12 కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

13 మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము;

14 దాని రక్తము దాని ప్రాణమునకాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

15 మరియు కళేబరమునైనను చీల్చబడినదానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.

16 అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.