Logo

లేవీయకాండము అధ్యాయము 22

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటివలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.

03 నీవు వారితో ఇట్లనుము మీ తర తరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించువాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.

04 అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమైనను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును,

05 అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలమువరకు అపవిత్రుడగును.

06 అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొనువరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.

07 సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.

08 అతడు కళేబరమునైనను చీల్చబడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.

09 కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను.

10 అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,

11 అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.

12 యాజకుని కుమార్తె అన్యునికియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.

13 యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు.

14 ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడల వాడు ఆ ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.

15 ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనవాటిని తినుటవలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.

16 నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము.

17 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

18 నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో

19 వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱమేకలలోనుండి యైనను దోషములేని మగదానిని అర్పింపవలెను.

20 దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు.

21 ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలి రూపముగా గోవునైనను గొఱ్ఱనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషములేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.

22 గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టివాటిని యెహోవాకు అర్పింపకూడదు; వాటిలో దేనిని బలిపీఠముమీద యెహోవాకు హోమము చేయకూడదు.

23 కురూపియైన కోడెనైనను గొఱ్ఱ మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు.

24 విత్తులు నులిపినదానినేగాని విరిగినదానినేగాని చితికినదానినేగాని కోయబడినదానినేగాని యెహోవాకు అర్పింపకూడదు; మీ దేశములో అట్టికార్యము చేయకూడదు;

25 పరదేశి చేతినుండి అట్టివాటిలో దేనిని తీసికొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు; అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము.

26 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

27 దూడయేగాని, గొఱ్ఱపిల్లయేగాని, మేకపిల్లయేగాని, పుట్టినప్పుడు అది యేడు దినములు దాని తల్లితో నుండవలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును.

28 అయితే అది ఆవైనను గొఱ్ఱ మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్కనాడే వధింపకూడదు.

29 మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.

30 ఆనాడే దాని తినివేయవలెను; మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.

31 మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను.

32 నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును;

33 నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.