Logo

లేవీయకాండము అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైనయెడల, ఎట్లనగా

03 ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

04 అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను

05 అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను.

06 ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను.

07 అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను.

08 మరియు అతడు పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని

09 మూత్రగ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల పైనున్న కాలేజముమీది వపను

10 సమాధానబలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను.

11 ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ

12 పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.

13 ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల

14 వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు, సంఘము పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

15 సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.

16 అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెయొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొనిరావలెను.

17 ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెరవైపున యెహోవా సన్నిధిని ఏడు మారులు దాని ప్రోక్షింపవలెను.

18 మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.

19 మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను.

20 అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును.

21 ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి.

22 అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల

23 అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

24 ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.

25 ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.

26 సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

27 మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల

28 తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

29 పాపపరిహారార్థ బలిపశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను.

30 యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.

31 మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

32 ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి

33 పాపపరిహారార్థబలియగు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థబలియగు దానిని వధింపవలెను.

34 యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.

35 మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.