Logo

లేవీయకాండము అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దానిగూర్చిన విధి యేదనగా

02 దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

03 దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును

04 రెండు మూత్రగ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను.

05 యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;

06 అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.

07 పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకునిదగును.

08 ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది; అది అతనిదగును.

09 పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.

10 అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.

11 ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా

12 వాడు కృతజ్ఞతార్పణముగా దానినర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.

13 ఆ పిండివంటలే కాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.

14 మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలి పశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.

15 సమాధానబలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.

16 అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దానినర్పించునాడే తినవలెను.

17 మిగిలినది మరునాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలినదానిని అగ్నితో కాల్చివేయవలెను.

18 ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.

19 అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని

20 ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

21 ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని యే అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

22 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

23 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎద్దుదేగాని గొఱ్ఱదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు.

24 చచ్చినదాని క్రొవ్వును చీల్చినదాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు.

25 ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

26 మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.

27 ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

28 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

29 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎవడు యెహోవాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను.

30 అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.

31 యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.

32 సమాధానబలి పశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడిజబ్బ నియ్యవలెను.

33 అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.

34 ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.

35 వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలోనుండినది అభిషేకమునుబట్టి అహరోనుకును అభిషేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను.

36 వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను.

37 ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహారార్థబలిని గూర్చియు అపరాధపరిహారార్థబలిని గూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలిని గూర్చియు చేయబడిన విధి.

38 ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసికొనిరావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.