Logo

మత్తయి అధ్యాయము 18

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోకరాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,

02 ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను

03 మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

04 కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.

05 మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును.

06 నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు.

07 అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ

08 కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండుచేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు.

09 నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.

10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.

11 మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల

12 తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా?

13 వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

14 ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.

15 మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.

16 అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.

17 అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.

18 భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.

20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.

21 ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.

22 అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడు మారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

23 కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక రాజును పోలియున్నది.

24 అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.

25 అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.

26 కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా

27 ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.

28 అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనిని చూచి, వాని గొంతుపట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను

29 అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నాయెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని

30 వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.

31 కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.

32 అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;

33 నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.

34 అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వానినప్పగించెను.

35 మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.