Logo

మార్కు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను.

02 అచ్చటివారు ఆయనమీద నేరము మోపవలెనని యుండి, విశ్రాంతిదినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి.

03 ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచచెయ్యి గలవానితో చెప్పి

04 వారిని చూచి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి.

05 ఆయన వారి హృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

06 పరిసయ్యులు వెలుపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయననేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

07 యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,

08 మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.

09 జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచి యుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.

10 ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి.

11 అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలువేసిరి.

12 తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.

13 ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయనయొద్దకు వచ్చిరి.

14 వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు

15 అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండుమందిని నియమించెను.

16 వారెవరనగా ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను

17 జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయనేర్గెసను పేరు పెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.

18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,

19 ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు.

20 ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపుకూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.

21 ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

22 యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

23 అప్పుడాయన వారిని తనయొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును?

24 ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు.

25 ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు.

26 సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతేరును.

27 ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును.

28 సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని

29 పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

30 ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.

31 ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి.

32 వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా

33 ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని

34 తన చుట్టు కూర్చున్నవారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;

35 దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను.