Logo

మార్కు అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

02 ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను.

03 అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.

04 మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి.

05 అప్పుడు పేతురు బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను;

06 వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.

07 మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

08 వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమయొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.

09 వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకుముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.

10 మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.

11 వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.

12 అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి?

13 ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

14 వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.

15 వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తికొనివచ్చి ఆయనకు వందనము చేసిరి.

16 అప్పుడాయన మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారినడుగగా

17 జనసమూహములో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొనివచ్చితిని;

18 అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్చిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను

19 అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని వారితో చెప్పగా

20 వారాయనయొద్దకు వానిని తీసికొనివచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.

21 అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రినడుగగా అతడు బాల్యమునుండియే;

22 అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.

23 అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.

24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.

25 జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొని వచ్చుట యేసు చూచి మూగవైన చెవిటిదయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.

26 అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి.

27 అయితే యేసు వాని చెయ్యిపట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను.

28 ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.

29 అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.

30 వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లుచుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను;

31 ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను.

32 వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.

33 అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక

34 ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా

35 వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచి ఎవడైనను మొదటివాడై యుండగోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి

36 యొక చిన్నబిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని

37 ఇట్టి చిన్నబిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనునని వారితో చెప్పెను.

38 అంతట యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను.

39 అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి; నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు;

40 మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.

41 మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

42 నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు.

43 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము;

44 నీవు రెండుచేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.

45 నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము;

46 రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు.

47 నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపారవేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.

48 నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.

49 ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.

50 ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైనయెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారైయుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.