Logo

లూకా అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా

02 ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా?

03 కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.

04 మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్న వారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?

05 కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.

06 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడియుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు

07 గనుక అతడు ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను.

08 అయితే వాడు అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము;

09 అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.

10 విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు

11 పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంతమాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.

12 యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి

13 ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.

14 యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి పని చేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.

15 అందుకు ప్రభువు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లు పెట్టును గదా.

16 ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.

17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించెను.

18 ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును?

19 ఒక మనుష్యుడు తీసికొనిపోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించెననెను.

20 మరల ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును?

21 ఒక స్త్రీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను.

22 ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను.

23 ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? అని ఆయననడుగగా

24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింపజూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.

25 ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపుతట్టి అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించినప్పుడు

26 ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు.

27 అప్పుడాయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను; అక్రమము చేయు మీరందరు నాయొద్దనుండి తొలగిపొండని చెప్పును.

28 అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.

29 మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియు వచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు.

30 ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.

31 ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా

32 ఆయన వారిని చూచి మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణసిద్ధి పొందెదను.

33 అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు.

34 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కలక్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి.

35 ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.