Logo

లూకా అధ్యాయము 16

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా

02 అతడు వాని పిలిపించి నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇకమీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.

03 ఆ గృహనిర్వాహకుడు తనలోతాను నా యజమానుడు ఈ గృహనిర్వాహకత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమిచేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను.

04 నన్ను ఈ గృహనిర్వాహకత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని,

05 తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివానినడిగెను.

06 వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను.

07 తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు. వానితో నీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను.

08 అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులైయున్నారు

09 అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను

10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

11 కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?

12 మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?

13 ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను.

14 ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా

15 ఆయన మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.

16 యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు

17 ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పిపోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.

18 తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు.

19 ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.

20 లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటివాకిట పడియుండి

21 అతని బల్లమీదనుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.

22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

23 అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి

24 తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను

25 అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు

26 అంతేకాక ఇక్కడనుండి మీయొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి యున్నదని చెప్పెను

27 అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.

28 వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.

29 అందుకు అబ్రాహాము--వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా

30 అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.

31 అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.