Logo

యోహాను అధ్యాయము 19

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.

02 సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి

03 ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి.

04 పిలాతు మరల వెలుపలికి వచ్చి ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

05 ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.

06 ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలువేయగా పిలాతు ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువ వేయుడని వారితో చెప్పెను.

07 అందుకు యూదులు మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.

08 పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి

09 నీవెక్కడనుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు

10 గనుక పిలాతు నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా? అని ఆయనతో అనెను.

11 అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

12 ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.

13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.

14 ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా

15 అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి

16 అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

17 వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.

18 అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.

19 మరియు పిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.

20 యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.

21 నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా

22 పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిననెను.

23 సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక

24 వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.

25 ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.

26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,

27 తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.

28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను.

29 చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.

30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.

31 ఆ దినము సిద్ధపరచు దినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువమీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.

32 కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటివాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.

33 వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని

34 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

35 ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగును.

36 అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.

37 మరియు తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.

38 అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను

39 మొదట రాత్రివేళ ఆయనయొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.

40 అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి.

41 ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధి యొకటి యుండెను.

42 ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.