Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.

02 అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.

03 కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;

04 అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి.

05 ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని

06 వారిని అపొస్తలుల యెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.

07 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.

08 స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.

09 అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని

10 మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.

11 అప్పుడు వారు వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని

12 ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి

13 అతనిని పట్టుకొని మహాసభయొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారుఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు

14 ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.

15 సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.