Logo

రోమీయులకు అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము

02 మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.

03 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి

04 శ్రమలయందును అతిశయపడుదము.

05 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

06 ఏలయనగా మనమింక బలహీనులమైయుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.

07 నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును.

08 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

09 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయనద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

10 ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

11 అంతేకాదు; మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము.

12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

13 ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.

14 అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను,

15 అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరియెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను

16 మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.

17 మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకనిద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.

18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.

19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.

20 మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,

21 ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.