Logo

రోమీయులకు అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.

02 క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు.

03 పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును.

04 వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.

05 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

06 అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.

07 అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,

08 అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు.

09 వాగ్దానరూపమైన వాక్యమిదే మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.

10 అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,

11 ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,

12 పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.

13 ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది.

14 కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.

15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.

16 కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువానివలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.

17 మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందునిమిత్తమే నిన్ను నియమించితిని.

18 కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును.

19 అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు.

20 అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?

21 ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?

22 ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిననేమి?

23 మరియు మహిమపొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,

24 అన్యజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్ననేమి?

25 ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును.

26 మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.

27 మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని

28 యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు.

29 మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతానము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.

30 అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;

31 అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు,

32 వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియలమూలముగా నైనట్లు దానిని వెంటాడిరి.

33 ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.