Logo

రోమీయులకు అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునైయున్నవి.

02 వారు దేవునియందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.

03 ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.

04 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.

05 ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.

06 అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;

07 లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.

08 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.

09 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

11 ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థన చేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

13 ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.

14 వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?

15 ప్రకటించువారు పంపబడనియెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందువిషయమై ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది

16 అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?

17 కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

18 అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా?వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్లెను.

19 మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా?జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగజేతును. అని మొదట మోషే చెప్పుచున్నాడు.

20 మరియు యెషయా తెగించి నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.

21 ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నాచేతులు చాచితిని అని చెప్పుచున్నాడు.