క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.
02 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులైయున్నారు కారా?
03 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?
04 ఒకడు నేను పౌలువాడను, మరియొకడు నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా?
05 అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
06 నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే
07 కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
08 నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
09 మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
10 దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.
11 వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.
12 ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల,
13 వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
14 పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.
15 ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.
16 మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
17 ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు.
18 ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
19 ఈ లోకజ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
20 మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
21 కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.
22 పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.
23 మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.