Logo

1కొరిందీయులకు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?

02 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?

03 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?

04 కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?

05 మీకు సిగ్గు రావలెనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?

06 అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడుచున్నాడు.

07 ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?

08 అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు.

09 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను

10 దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

11 మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.

12 అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను.

13 భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

14 దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.

15 మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.

16 వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమైయుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.