Logo

1కొరిందీయులకు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

02 అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త యుండవలెను.

03 భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.

04 భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

05 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

06 ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండగోరుచున్నాను.

07 అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

08 నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.

09 అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లి చేసికొనవచ్చును; కామతప్తులగుటకంటె పెండ్లి చేసికొనుట మేలు.

10 మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

11 ఎడబాసినయెడల పెండ్లి చేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.

12 ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి, ఆమె అతనితో కాపురముచేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

13 మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.

14 అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు

15 అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో - మిమ్మును అని పాటాంతరము) పిలిచియున్నాడు

16 ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?

17 అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.

18 సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.

19 దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమియు లేదు.

20 ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.

21 దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.

22 ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.

23 మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.

24 సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

25 కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను.

26 ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.

27 భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.

28 అయినను నీవు పెండ్లి చేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసికొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను

29 సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమైయున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును

30 ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును

31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.

32 మీరు చింత లేనివారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు.

33 పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు.

34 అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయి యుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది

35 మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.

36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును

37 ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.

38 కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.

39 భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసికొనవలెను.

40 అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.