Logo

1కొరిందీయులకు అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము: మనమందరము జ్ఞానము గలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

02 ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.

03 ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.

04 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

05 దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

06 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.

07 అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు;

08 భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.

09 అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.

10 ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?

11 అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.

12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు.

13 కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.