Logo

ఎఫెసీయులకు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఈ హేతువుచేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తుయేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.

02 మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటునుగూర్చి మీరు వినియున్నారు.

03 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

04 మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.

05 ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు.

06 ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే.

07 దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

08 దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

09 పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,

10 శోధింప శక్యముకాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును,

11 సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

12 ఆయన యందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.

13 కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై యున్నవి.

14 ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

15 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మవలన బలపరచబడునట్లుగాను,

16 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,

17 తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు,

18 మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

21 క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్‌.