Logo

ఎఫెసీయులకు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే.

02 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,

03 అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

04 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.

05 దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీరవిషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి.

06 మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,

07 మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.

08 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.

09 యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.

10 తుదకు ప్రభువు యొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.

11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

13 అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి

14 ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని

15 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి.

16 ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.

17 మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి.

18 ఆత్మవలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.

19 మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు

20 దానినిగూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.

21 మీరును నా క్షేమ సమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును.

22 మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని.

23 తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.

24 మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువారికందరికిని కృప కలుగును గాక.