Logo

సంఖ్యాకాండము అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.

02 ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దానిచుట్టు దిగవలెను.

03 సూర్యుడు ఉదయించు తూర్పుదిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.

04 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.

05 అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.

06 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగువేల నాలుగువందలమంది.

07 అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.

08 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగువందలమంది.

09 యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.

10 రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణదిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.

11 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.

12 అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.

13 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడువందలమంది.

14 అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.

15 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది.

16 రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను.

17 ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.

18 ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపు ధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.

19 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.

20 అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.

21 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది.

22 అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

23 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది.

24 ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనిమిదివేల నూరుమంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను.

25 దాను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ఉత్తరదిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.

26 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది.

27 అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.

28 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యొకవేయి ఐదువందలమంది.

29 అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.

30 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది.

31 దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబది యేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

32 వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.

33 అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

34 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.