Logo

సంఖ్యాకాండము అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.

02 పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడల వాడు ద్రాక్షారసమద్యములను మానవలెను.

03 ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.

04 అతడు ప్రత్యేకముగానుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.

05 అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.

06 అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు.

07 తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు.

08 అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.

09 ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుటవలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడినయెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకొనవలెను.

10 ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను.

11 అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవ దానితో దహనబలిని అర్పించి, వాడు శవము ముట్టుటవలన పాపియైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధ పరపవలెను.

12 మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱపిల్లను తీసికొనిరావలెను; తన వ్రత సంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.

13 నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొనిరావలెను.

14 అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను, సమాధానబలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,

15 గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను.

16 అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.

17 యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.

18 అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించుకొని, ఆ వ్రత సంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.

19 మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రత సంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతనిచేతుల మీద వాటినుంచవలెను.

20 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.

21 మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమికొలది ఇచ్చుదాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దానిగూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధినిబట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.

22 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము

23 మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.

24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక;

25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక;

26 యెహోవా నీమీద తన సన్నిధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.

27 అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.