Logo

సంఖ్యాకాండము అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో

02 నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.

03 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.

04 ఆ దీపవృక్షము బంగారు నకిషిపని గలది; అది దాని స్తంభము మొదలుకొని పుష్పములవరకు నకిషిపని గలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.

05 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలోనుండి

06 లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము.

07 వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహారార్థ జలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలికత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని

08 తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొనిరావలెను.

09 అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొనివచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయవలెను.

10 నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమచేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను.

11 లేవీయులు యెహోవా సేవచేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను.

12 లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి

13 అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.

14 అట్లు నీవు ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారైయుందురు.

15 తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.

16 ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.

17 ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తు దేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని.

18 ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొనియున్నాను.

19 మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.

20 అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి.

21 లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

22 తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను.

23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇది లేవీయులను గూర్చిన విధి.

24 ఇరువదియైదేండ్లు మొదలుకొని పై ప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పనిచేయుటకు రావలెను.

25 అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.

26 వారు కాపాడవలసినవాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితో కూడ పరిచర్య చేయవలెనుగాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను.