Logo

సంఖ్యాకాండము అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఐగుప్తు దేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.

03 దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.

04 కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.

05 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.

06 కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి.

07 వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతివిు; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా

08 మోషే నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసికొందునని వారితో అనెను.

09 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

10 మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అపవిత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.

11 వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.

12 వారు మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడలన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను.

13 ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానినయెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను.

14 మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.

15 వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.

16 నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.

17 ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.

18 యెహోవా నోటి మాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటి మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.

19 ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి.

20 మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటి మాటచొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాటచొప్పుననే ప్రయాణము చేసిరి.

21 ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచినయెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణముచేసిరి.

22 ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవుచేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.

23 యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞననుసరించి నడిచిరి.