Logo

సంఖ్యాకాండము అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత

03 యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినేకాని, గొఱ్ఱమేకలలోని దానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల

04 యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.

05 ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను.

06 పొట్టేలుతో కూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను.

07 పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.

08 మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల

09 ఆ కోడెతో కూడ పడిన్నర నూనె కలుపబడిన ఆరు పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను.

10 మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా

11 పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను, గొఱ్ఱలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.

12 మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.

13 దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను.

14 మీయొద్ద నివసించు పరదేశిగాని మీ తర తరములలో మీ మధ్యనున్న వాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.

15 సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తర తరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును.

16 మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను.

17 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

18 నేను మిమ్మును కొనిపోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత

19 మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.

20 మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను.

21 మీ తర తరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.

22 యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా

23 యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియబడనియెడల

24 సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను.

25 యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

26 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారి మధ్యను నివసించు పరదేశియేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను.

27 ఒకడు పొరబాటున పాపము చేసినయెడల వాడు పాపపరిహారార్థబలిగా ఏడాది ఆడు మేకపిల్లను తీసికొనిరావలెను.

28 పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును.

29 ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశియేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.

30 అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల

31 వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టివేయబడును; వాడు యెహోవా మాటను అలక్ష్యముచేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.

32 ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి.

33 వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వసమాజము నొద్దకును వానిని తీసికొనివచ్చిరి.

34 వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.

35 తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.

36 సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.

37 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

38 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను.

39 మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకము చేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులై యుండునట్లు మునుపటివలె కోరినవాటినిబట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక,

40 దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకము చేసికొని వాటిననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును.

41 నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.