Logo

సంఖ్యాకాండము అధ్యాయము 35

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెరికోయొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.

03 వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను.

04 మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు

05 మరియు మీరు ఆ పురముల వెలుపలనుండి తూర్పుదిక్కున రెండువేల మూరలను, దక్షిణదిక్కున రెండువేల మూరలను, పడమటిదిక్కున రెండువేల మూరలను, ఉత్తరదిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.

06 మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియు గాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

07 వాటి వాటి పల్లెలతోకూడ మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నియు నలువది యెనిమిది.

08 మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములోనుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యముచొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను.

09 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

10 మీరు యొర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్లిన తరువాత

11 ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను.

12 పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచువరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును.

13 మీరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను.

14 వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్యవలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును.

15 పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమైయుండును.

16 ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.

17 ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

18 మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

19 హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.

20 వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను.

21 నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.

22 అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,

23 దెబ్బతినినవాడు చనిపోయినయెడల కొట్టినవాడు వానిమీద పగపట్టలేదు, వానికి హాని చేయగోరలేదు.

24 కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టినవానికిని హత్య విషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను.

25 అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధతైలముతో అభిషేకింపబడిన ప్రధానయాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.

26 అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లునప్పుడు

27 నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.

28 ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును.

29 ఇవి మీ సమస్త నివాసస్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.

30 ఎవడైనను ఒకని చావగొట్టినయెడల సాక్షుల నోటిమాటవలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింపకూడదు.

31 చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.

32 మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు.

33 మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగునుగాని మరి దేనివలనను కలుగదు.

34 మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.