Logo

1దెస్సలోనీకయులకు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.

02 కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.

03 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

04 మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,

05 పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగి యుండుటయే దేవుని చిత్తము.

06 ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.

07 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.

08 కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.

09 సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవునిచేతనే నేర్పబడితిరి.

10 ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి యొక్కువగా అభివృద్ధి నొందుచుండ వలెననియు,

11 సంఘమునకు వెలుపటివారియెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక,

12 మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీచేతులతో పనిచేయుట యందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

13 సహోదరులారా, నిరీక్షణ లేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారినిగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14 యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15 మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16 ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

18 కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.