Logo

1తిమోతి అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మల యందును

02 దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

03 ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

04 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;

05 ఏలయనగా అది దేవుని వాక్యమువలనను ప్రార్థనవలనను పవిత్రపరచబడుచున్నది.

06 ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు.

07 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.

08 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.

09 ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైయున్నది.

10 మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.

11 ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము.

12 నీ యౌవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.

13 నేను వచ్చువరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము.

14 పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.

15 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.

16 నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.