Logo

1తిమోతి అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచవలెను.

02 విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.

03 ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల

04 వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములనుగూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,

05 చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములును కలుగుచున్నవి.

06 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది.

07 మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.

08 కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొంది యుందము.

09 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

11 దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.

12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

13 సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,

14 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగువరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.

15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు.

16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

17 ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.

18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలు చేయువారును,

19 సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.

20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము.

21 ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.